కొట్టుకున్న బీజేపీ, MIM కౌన్సిలర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఉత్తర ప్రదేశ్లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రచ్చకు దారి తీసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రచ్చకు దారి తీసింది. వందేమాతరం విషయంలో బీజేపీ, ఎంఐఎంకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం భౌతిక దాడుల వరకు వెళ్లింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ప్రశాంతంగా జరగాల్సిన ఈ కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆడిటోరియంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం కౌన్సిలర్లు లేచి నిలబడలేదు. దీంతో ఎంఐఎం కౌన్సిలర్ల తీరును బీజేపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. దీంతో ఇరు పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు రెండుగా చీలిపోయి పిడిగుద్దులు, చెంపదెబ్బలతో భౌతిక దాడులు చేసుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.