Champai Soren: మీరో పులి.. ఎన్డీఏ ఫ్యామిలీలోకి స్వాగతం

జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపై సోరెన్‌ (Champai Soren) బీజేపీలో చేరిక ఖాయమైనట్లే కన్పిస్తోంది. గతకొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Update: 2024-08-19 08:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపై సోరెన్‌ (Champai Soren) బీజేపీలో చేరిక ఖాయమైనట్లే కన్పిస్తోంది. గతకొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి టైంలో కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ(Jitan Ram Manjhi) చేసిన పోస్టు వైరల్‌గా మారింది. చంపై సోరెన్ ను పులితో పోలుస్తూ కొనియాడారు. ‘‘చంపై సోరెన్‌.. మీరు అప్పుడు, ఇప్పుడు పులిలానే ఉన్నారు. మీరు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎన్డీయే ఫ్యామిలీలోకి స్వాగతం.’’ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇకపోతే, జితన్ రామ్ మాంఝీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత. ఆ పార్టీ బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది.

బీజేపీ నేతలతో చర్చలు

ఇదిలాఉంటే.. చంపై సోరెన్ ఆరుగురు ఎమ్మెల్యేలతో ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారనే వార్తలు వచ్చాయి. ఏ సమయంలోనైనా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా సొంత పనిమీదే ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. చంపైతో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పలువురు బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. బెంగాల్‌ బీజేపీ నేత సువేందు అధికారి, కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. చంపై సోరెన్‌ ఈ వార్తలపై ఇటీవలే వివరణ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. అయితే, బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే, తన ముందు మూడు మార్గాలున్నాయంటూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు.


Similar News