Disaster Management Act: విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
గురువారం కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్‌లో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడడం లాంటి ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విపత్తు నిర్వహణ చట్టం-2005 చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి గురువారం కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్‌లో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పలు కీలక అంశాలను ప్రభుత్వం చేర్చింది. రాష్ట్రాలు, జాతీయ విపత్తులకు సంబంధించిన సమగ్రమైన డేటాబేస్ ఏర్పాటును ప్రతిపాదించింది. విపత్తు సంభవించిన వెంటనే అంచనా, చర్యలకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో అర్బన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. విపత్తు డేటాబేస్‌లో కేంద్రం నిర్ణయించిన నిధుల కేటాయింపు వివరాలు, వ్యయం, విపత్తుల ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు ఉంటాయి. కాగా, గత కొద్దిరోజుల వ్యవధిలో సుమారు ఏడు రాష్ట్రాలు భారీ వర్షాలను ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ రాష్ట్రాల్లో 32 మంది మరణించారు. కేరళలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో 250 మందికి పైగా మరణించారు.