కరోనా కష్ట సమయాల్లో భారత్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది : స్వీయ బ్లాగ్ పోస్ట్‌లో బిల్ గేట్స్

కరోనా వంటి కష్టసమయాల్లో భారత్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్నో దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకున్నాయి.

Update: 2023-02-23 16:15 GMT

న్యూఢిల్లీ: కరోనా వంటి కష్టసమయాల్లో భారత్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్నో దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకున్నాయి. అంతేకాదు మందుల తయారీలోనూ ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూశాయి. అందుకేనేమో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ పట్ల తన బ్లాగ్ పోస్ట్‌లో పాజిటివ్‌గా స్పందించారు. భవిష్యత్తుపై భారత్ ఆశలు కల్పించిందని.. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. పేదరికంపై యావత్ ప్రపంచం పురుగతి సాధించాల్సిన అవసరం ఉందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ చైర్మన్ బిల్ గేట్స్ తన బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

కష్టకాలంలోనూ ఎదురొడ్డి నిలిచి అద్భుతమైన పురోగతిని సాధించిన భారత్‌కు మించిన ఉదాహరణ మరొకటి లేదని ఆయన అన్నారు. 'మొత్తానికి భారత దేశం నాకు భవిష్యత్తుపై ఆశలు కల్పించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతోంది. అయితే భారత్ పెద్ద సవాళ్లను కూడా ఎదుర్కోగలదని నిరూపించింది. దేశంలో పోలియోను నిర్మూలించింది. హెచ్ఐవీ ప్రచారాన్ని తగ్గించింది. పేదరికాన్ని తగ్గించింది. శిశు మరణాలను తగ్గించింది. పారిశుద్ధ్యం, ఆర్థిక సేవలకు ప్రాధాన్యత పెంచింది' అని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు. మార్పులకు భారత్ పెద్ద పీట వేస్తోందన్నారు.

ముఖ్యంగా ఆరోగ్యంపై సాధించిన పురోగతి ప్రజలను మరింత దృఢంగా చేస్తోందని చెప్పారు. 'భారత్ వేగంగా స్పందిస్తుంది. పెద్ద కార్యక్రమాలను రూపొందించడంలో దాని నైపుణ్యం అమోఘం. ప్రజల వినూత్నమైన ఆలోచనా విధానం అద్భుతం. అంతేకాదు పెద్ద సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ భూమ్మీద ఉన్న ఇతర దేశాల్లాగే భారత్‌కు కూడా పరిమితమైన వనరులు ఉన్నాయి. కానీ అంతటి నిర్భందం ఉన్నప్పటికీ ప్రపంచం ఎలా పురోగమించగలదో మనకు చూపించింది' అని బిల్ గేట్స్ చెప్పారు.

Tags:    

Similar News