Prashant Kishor: బిహార్ అభివృద్ధి గురించి తేజస్వి మాట్లాడటం హాస్యాస్పదం

ఆర్జేడీ నేత బిహార్ మాజీ సీఎం తేజస్వి యాదవ్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విరుచుకుపడ్డారు.

Update: 2024-08-25 14:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం తేజస్వి యాదవ్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విరుచుకుపడ్డారు. పాట్నాలో మహిళా సెల్ సమావేశం నిర్వహించిన తర్వాత పీకే విలేకరులతో మాట్లాడారు. బిహార్‌ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. 1990 నుంచి 2005 వరకు 15 ఏళ్ల ఆర్జేడీ పాలనలో ఉన్న బిహార్ అభివృద్ధి గురించి తేజస్వి మాట్లాడటం నవ్వు తెప్పించిందన్నారు. ఆరు నెలల క్రితం తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బిహార్ అతనికి స్విట్జర్లాండ్ లా కన్పించిందన్నారు. ఆరు నెలల తర్వాత బిహార్ అధ్వానంగా మారిందా అని ప్రశ్నించారు. నితీశ్ కుమార్ మహాఘటబంధన్ లో చేరితే మళ్లీ బిహార్ గొప్పగానే కన్పిస్తుందని చురకలు అంటించారు. కులం, దోపిడీ, మద్యం మాఫీయా, నేరాలపై తేజస్వీ యాదవ్‌ కామెంట్స్‌ చేయవచ్చని.. కానీ, అభివృద్ధిపై మాట్లాడడం జోక్ అని పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయనకు జీడీపీ, జీడీపీ వృద్ధి అంటే ఏమిటో తెలియదని విమర్శించారు.

కులగణనపై ఏమన్నారంటే?

కుల గణనపై కిషోర్ మాట్లాడుతూ.. కుల గణన జరగాలని.. అందులో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కులగణన నిర్వహించాలని రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపైన ప్రశాంత్ కిశోర్ స్పందించారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉందని.. అప్పుడు కుల గణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. బిహార్ లో కులగణన జరిగిందని.. అయితే పేదరిక నిర్మూలన మాత్రం జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలన కోసం కులగణన నిర్వహించాలని రాహుల్ కి పీకే సూచించారు. అక్కడ ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు కూడా అదే నమూనాను అనుసరిస్తాయని అన్నారు. బిహార్ పేదరాష్ట్రమనే వాస్తవం అందరికీ తెలుసన్నారు. సర్వేలు నిర్వహించే బదులుగా బిహార్లో పరిస్థితిని మెరుగుపరచడానికి రాహుల్ గాంధీ ఏదైనా ఆలోచించాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం

అక్టోబర్‌ 2న ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించనున్నారు. జన్‌ సూరజ్‌ పార్టీ 2025లో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. 243 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేస్తారన్నారు. 2030 నాటికి 70 నుంచి 80 మంది మహిళా నేతలను జన్‌ సూరజ్‌ నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతామని అన్నారు. మహిళా సెల్‌ సమావేశంపై ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడుతూ.. ఇది మహిళా సెల్‌ సమావేశం కాదని.. ఇది నిజమైన అర్థం మహిళా నాయకులను చేసే ప్రయత్నం అని అన్నారు. మహిళలు జీవనోపాధికి సర్కారు గ్యారంటీతో రుణాలు పొందేలా చూడాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం కొలువుదీరితే 10-12వేల ఉద్యోగాల కోసం బిహార్‌ను విడిచిపెట్టమని ఎవరూ బలవంతం చేయరని పేర్కొన్నారు. ఇందుకోసం పూర్తిగా బ్లూప్రింట్ సిద్ధం చేశామని వెల్లడించారు.


Similar News