బీహార్‌లో కూలిన మరో వంతెన.. మూడు వారాల్లో 13వ ఘటన

సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వంతెన కూలింది

Update: 2024-07-10 12:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్వహణ లోపం కారణంగా బ్రిడ్జిలు కూలుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి ఇంజనీర్లను కూడా సస్పెండ్ చేసింది. తాజాగా బుధవారం మరో వంతెన కూలింది. దీంతో మూడు వారాల వ్యవధిలో ఇది 13వ ఘటన అని ఓ అధికారి తెలిపారు. సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వంతెన కూలింది. 'ఇది చిన్న వంతెన. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ' సహర్సా అదనపు కలెక్టర్ జ్యోతి కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం లాంటివి సంభవించలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా, గత కొద్దిరోజులుగా భారీ వర్షాలకు సివాన్, సరన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్‌లతో సహా వివిధ జిల్లాల్లో వంతెనలు కూలిన ఘటనల వ్యవహారంలో బీహా ప్రభుత్వం ఇప్పటివరకు 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే చేసి తక్షణం మరమ్మతులు చేయాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.  


Similar News