బీజేపీ విధానాలతో చిరు వ్యాపారులకు భారీ నష్టం: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో చిన్న వ్యాపారులు భారీగా నష్టపోయారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. హర్యానాలోని మండిలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Update: 2024-05-29 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో చిన్న వ్యాపారులు భారీగా నష్టపోయారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. హర్యానాలోని మండిలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ..నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దేశంలోని చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. మోడీ హయాంలో ఉపాధి అవకాశాలు తగ్గాయని, గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగి పోయిందని తెలిపారు. అంతేగాక పర్యాటక రంగం కూడా నష్టాల్లోనే ఉందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చిరు వ్యాపారులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ రంగం ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.

దేశంలోని సంపదంతా కొద్దిమంది బిలియనీర్లకు నెమ్మదిగా అందజేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని బొగ్గు, గనులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, అన్నీ మోడీ స్నేహితులకే అప్పగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపిల్ ధరను అదానీ నిర్ణయించే స్థాయికి దేశం వెళ్లిపోయిందనన్నారు.‘హిమాచల్‌కు చెందిన చాలా మంది యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారు. కానీ మోడీ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌తో యువకులకు అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే ఏదైనా ఘటనలో అగ్నివీర్‌ మరణిస్తే.. అతనికి అమరవీరుడు హోదా రాదు. అంతేగాక వారి తల్లిదండ్రులకు పింఛను కూడా రాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ స్కీమ్‌ను కాంగ్రెస్ రద్దు చేస్తుందన్నారు. 


Similar News