దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు అనుమానితుల గురించి సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించింది. ఈ నెల 1న బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లలో ప్రధాన నిందితులకు సాయం చేసిన ముజిమ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు గురువారమే అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కేఫ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని అమర్చిన నిందితులు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, పేలుడుకు కుట్ర పన్నిన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా అనే ఇద్దరు నిందితులపై ఎన్ఐఏ తాజాగా భారీ రివార్డు ప్రకటించింది. వీరిద్దరూ ఇప్పటికే 2020 ఉగ్రవాద కేసులో వాంటెడ్ లిస్టులో ఉండటం గమనార్హం. అనుమానితులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా info.blr.nia@gov.in కు ఇమెయిల్ ద్వారా లేదా కాల్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది. ఇన్‌ఫార్మర్ ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపింది.