Bengal doctors: సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్.. విధుల్లో చేరని బెంగాల్ డాక్టర్లు

ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్ డాక్టర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది.

Update: 2024-09-10 14:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్ డాక్టర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఆందోళన చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల లోపు విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా వైద్యులు పట్టించుకోలేదు. గడువు దాటినా డ్యూటీలో చేరకుండా నిరసనలు కొనసాగించారు. తమకు, బాధితురాలికి న్యాయం జరగేవరకు సమ్మె కంటిన్యూ చేస్తామని తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మేము నిరాశ చెందాం. మా డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం వరకు గడువు ఇచ్చాం. మా డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగుతుంది. కాబట్టి విధులకు హాజరుకావాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

అంతేగాక సాల్ట్ లేక్ నుంచి స్వాస్థ్య భవన్ వరకు వైద్యులు పాదయాత్ర నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్, హెల్త్ సెక్రటరీ, హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాజీనామా చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటలలోపు వైధ్యులు విధులకు తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదంటే వైద్యులపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపలేమని స్పష్టం చేసింది. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో కనీసం 23 మంది రోగులు మరణించారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. 


Similar News