Bullet Trains: బుల్లెట్ ట్రైన్ తయారీ బాధ్యత బీఈఎంఎల్‌దే.. 2027 కల్లా ట్రాక్ పైకి..

బుల్లెట్ ట్రైన్ తయారీ కాంట్రాక్టు బీఈఎంఎల్‌ పొందింది. 2026 చివరికల్లా ట్రైన్ సెట్లను తయారు చేయనుంది.

Update: 2024-10-15 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మన దేశంలో అత్యధిక ప్రయాణికులకు ఆలంబనగా ఉన్న భారత రైల్వే వ్యవస్థ కొత్త హంగులు సమకూర్చుకుంటున్నది. వందే భారత్ ట్రైన్‌లతో మాడ్రన్‌గా మారిన భారత రైల్వేలోకి కొత్తగా బుల్లెట్ ట్రైన్ చేరనున్నది. ఈ బుల్లెట్ ట్రైన్ తయారీ కోసం ప్రాథమికంగా అడుగులు పడుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ డిజైన్, తయారీ, రెండు ట్రైన్ సెట్ల కాంట్రాక్టును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) నుంచి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) పొందింది.

ఒక్కో ట్రైన్ సెట్ విలువ రూ. 27.86 కోట్లు ఉంటుందని, మొత్తం కాంట్రాక్టు విలు రూ. 866.87 కోట్లు అని బీఈఎంఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో డిజైన్ కాస్ట్, వన్ టైం డెవలప్‌మెంట్ కాస్ట్, నాన్ రికరింగ్ చార్జీలు, జిగ్స్, ఫిక్స్చర్‌లు, టూలింగ్, టెస్టింగ్ సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇవి భవిష్యత్‌లో అందుబాటులోకి వచ్చే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులకు కూడా ఉపయోగపడనున్నాయి. బీఈఎంఎల్‌కు చెందిన బెంగళూరు రైల్ కోచ్ కాంప్లెక్స్ ఈ ట్రైన్ సెట్లను 2026 చివరికల్లా అందించనన్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ ట్రైన్ సెట్లలో ఫుల్ ఏసీ, చైర్ కార్ కాన్ఫిగరేషన్‌లు ఉంటాయి. రొటేట్ చేసుకునేలా కుర్చీలు, ట్రైన్‌లో వినోదం ఏర్పాట్లు ఉండనున్నాయి. భారత్ సొంతంగా తయారు చేసుకునే ఈ బుల్లెట్ ట్రైన్.. వేగవంతమైన ప్రయాణాలకు సంబంధించి కీలక మైలురాయిగా నిలవనుంది.

ఈ ఎనిమిది కోచ్‌ల ట్రైన్ సెట్లు గంటకు 249 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ముంబయి, అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ గుండా ఈ ట్రైన్ 2027 నుంచి సేవలు అందించనుంది.

Tags:    

Similar News