BBC: చెడ్డ పేరు తెచ్చాడు.. నమ్మకాన్ని దెబ్బతీశాడు

బీబీసీ మాజీ యాంకర్ హువ్ ఎడ్వర్డ్స్ పై బీబీసీ చర్యలు తీసుకుంది. అరెస్టయినప్పటి నుంచి తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని సూచించింది.

Update: 2024-08-10 04:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీబీసీ మాజీ యాంకర్ హువ్ ఎడ్వర్డ్స్ పై బీబీసీ చర్యలు తీసుకుంది. అరెస్టయినప్పటి నుంచి తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని సూచించింది. కాగా.. శుక్రవారం బీబీసీ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. " బీబీసీపై ఉన్న నమ్మకాన్ని హువ్ దెబ్బతీశారు. చెడ్డ పేరు తీసుకొచ్చారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే, లైంగిక నేరాలు, పిల్లలపై అసభ్యకర చిత్రాలను రూపొందించారనే ఆరోపణలపై గతేడాది నవంబర్‌లో హువ్ అరెస్టయ్యాడు. ఈ నేరాన్ని ఆయన అంగీకరించాడు. దీంతో, గరిష్ఠంగా 10 సంవత్సరాలు, కనిష్ఠంగా 12 నెలల జైలు శిక్ష ఎదుర్కోనున్నాడు. అరెస్టయినప్పటి నుంచి ఎడ్వర్డ్స్‌కు చెల్లించిన జీతాన్ని తిరిగి ఇవ్వాలని బోర్డు ప్రకటనలో పేర్కొంది. ఎడ్వర్డ్స్ భయంకరమైన నేరాన్ని అంగీకరించాడని.. అతడికి ప్రజాధనాన్ని చెల్లించడం కొనసాగించలేమని బోర్డు పేర్కొంది. ఎడ్వర్డ్స్ డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇంకా ధ్రువీకరించలేదు.

ఆరోపణలపై స్పందించని హువ్

హువ్ 40 సంవత్సరాల తర్వాత.. ఈఏడాది ఏప్రిల్‌లో బీబీసీ నుంచి నిష్క్రమించాడు. అయితే, తనపై వస్తున్న ఆరోపణల గురించి ఎక్కడా బహిరంగా ఆయన వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా అధికారులు స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో వాట్సప్ సంభాషణల ద్వారా ఎడ్వర్డ్స్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది నవంబర్ లో అతడి అరెస్టు గురించి బయటకు వచ్చింది. ఆ తర్వాత బీబీసీ అతడ్ని సస్పెండ్ చేసింది. ఐదునెలల తర్వాత ఆయన బీబీసీకి రాజీనామా చేశారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం, అంత్యక్రియలు సహా పలు కీలక ఈవెంట్లను ఆయన కవర్ చేశారు.


Similar News