Bangladesh: షేక్ హసీనాను అప్పగించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ లేఖ
న్యాయ ప్రక్రియ కోసం బంగ్లాదేశ్ ఆమెను తిరిగి తీసుకురావాలని భావిస్తున్నాం.
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ భారత్‌కు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ దౌత్య మార్గంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. తన 16 ఏళ్ల పాలనను విద్యార్థి సంఘాలు నిరసనల ద్వారా కూల్చివేయడంతో దేశాన్ని విడిచిపెట్టిన ఆమె, ఆగస్టు 5 నుంచి భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. దాంతో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాతో పాటు మరికొందరిపై 'మానవత్వం, మారణహోమం నేరాలకు సంబంధించి ' అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. న్యాయ ప్రక్రియ కోసం బంగ్లాదేశ్ ఆమెను తిరిగి తీసుకురావాలని భావిస్తున్నాం. దీని గురించి భారత ప్రభుత్వానికి దౌత్య సందేశం పంపామని ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ తన కార్యాలయంలో విలేకరులతో చెప్పారు. ఇదే సమయంలో బంగ్లాదే హోం శాఖ సైతం ఆమెను తమ దేశానికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతోంది. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం ఉందని, దాని ద్వారా హసీనాను తమ దేశానికి తప్పించుకుంటామని హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలమ్ అన్నారు.