Congress: ఆ కేసుని బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ గా భావిస్తున్నాం- కేసీ వేణుగోపాల్
రాజకీయ కక్షతోనే లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేసులు పెడుతున్నట్లు ఆ పార్టీ ఆరోపించింది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ కక్షతోనే లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేసులు పెడుతున్నట్లు ఆ పార్టీ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ చేస్తున్న కుట్రల వల్ల రాహుల్ ఇప్పటికే 26 ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కాపాడే ప్రయత్నంలో రాహుల్‌పై నమోదైన కేసును ‘బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్’గా భావిస్తున్నామని, ఇది తమకు గర్వకారణమని తెలిపారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఆర్ఎస్ఎస్-బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్‌ను, రాహుల్‌ను బీజేపీ ఎన్నటికీ నిలువరించలేదన్నారు. కాకపోతే, తాము బీజేపీ ఎంపీలపై ఫిర్యాదులు చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు కేసులు పెట్టట్లేదని వేణుగోపాల్ ప్రశ్నించారు.
పార్లమెంటులో తోపులాట
ఇకపోతే, గురువారం పార్లమెంట్ ఆవరణలో తోపులాట జరిగింది. ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడడానికి రాహుల్ గాంధీయే కారణమని ఆరోపించారు. రాహుల్ గాంధీ వారిని నెట్టివేశారని కాషాయ పార్టీ నేతలు ఆరోపించడంతో రాహుల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తర్వాత, ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు పంపినట్లు పోలీసులు వివరించారు. మరోవైపు, హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రశ్నించడం వల్లనే ఆయనపై బీజేపీ నేతలు ఇలాంటి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.