వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర చిన్నారి మృతి

కుటుంబసభ్యులు బాలికను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

Update: 2024-02-25 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో ఏడాదిన్నార బాలికను బలితీసుకున్నాయి. చుట్టుపక్కల ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ బాలిక తీవ్ర గాయాల పాలైంది. తక్షణం కుటుంబసభ్యులు బాలికను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. తుగ్లకాబాద్, చమన్ ఘాట్ ప్రాంతంలో రాహుల్‌కు కుటుంబం నివశిస్తోంది. రాహుల్‌కు ఏడాదిన్నర వయసున్న కూతురు దివాన్షి ఉంది. రాత్రి భోజనాల తర్వాత రాహుల్ కుటుంబ సభ్యులు ఇంటిబయట ఆడుకుంటున్న దివాన్షి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అదే సమయంలో ఇంటికి కొంతదూరంలో చిన్నారి దివాన్షిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికంగా సంగీత కార్యక్రమం(డీజే ప్లే) జరుగుతున్న కారణంగా వీధికుక్కల దాడిలో చిన్నారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఎలాగోలా దాడిని గమనించిన చుట్టుపక్కల వారు వాటి నుంచి చిన్నారిని కాపాడారు. ఘటన గురించి తెలిసి అక్కడున్న వారంతా పెద్ద ఎత్తున గుమిగూడి, చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఆసుపత్రిలో చేర్చిన అనంతరం అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. చమన్ ఘాట్ ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

గత కొంతకాలంగా పాదచారులపై, ముఖ్యంగా పిల్లలపై వీధికుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్లు అధికమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలను నిలువరించడంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

Tags:    

Similar News