బాబా టార్సెమ్‌సింగ్ హత్య: ప్రధాన నిందితుడి ఎన్ కౌంటర్
ఉత్తరాఖండ్‌లోని నానక్ మట్టా సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ బాబా టార్సెమ్ సింగ్‌ను గత నెల 28న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని నానక్ మట్టా సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ బాబా టార్సెమ్ సింగ్‌ను గత నెల 28న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షూటర్ అమర్‌జిత్ సింగ్ అలియాస్ బిట్టును భగవాన్ పూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేసినట్టు రాష్ట్ర డీజీపీ అభినవ్ కుమార్ మంగళవారం తెలిపారు. అతని మరొక సహచరుడు పారిపోయాడని చెప్పారు. ఉత్తరాఖండ్ ఎస్‌టీఎఫ్, హరిద్వార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు వెల్లడించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అమర్‌జిత్ సింగ్‌పై 16 కేసులు ఉన్నట్టు తెలిపారు.
టార్సెమ్‌సింగ్ హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు.. సరబ్‌జిత్ సింగ్, అమర్‌జిత్ సింగ్, మాజీ ఐఏఎస్ అధికారి హర్బన్స్ సింగ్ చుగ్, బాబా అనుప్ సింగ్, ప్రాంతీయ సిక్కు సంస్థ ఉపాధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ సంధులను నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడిని మట్టుబెట్టారు. మిగతా వారిని సైతం త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసును విచారించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.