Manish Sisodia: 17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది.

Update: 2024-08-10 06:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది. “17 నెలల తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. ఉదయాన్నే ఇంట్లో టీ తాగుతున్నా. రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది. అందరితో కలిసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకునే అవకాశాన్ని దేవుడు అందించాడు” అని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. తన నివాసంలో భార్యతో కలిసి టీ తాగుతున్న ఫొటోను జతచేశారు. హర్యానాలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి టైంలో సిసోడియా బయటకు రావడంతో ఆప్ నేతలు సంతోషంగా ఉన్నారు. అయితే, ఆప్ పై విమర్శలు చేయాలనుకునే వారికి సిసోడియాకు బెయిల్ రాడవంతో బ్రేకులు పడిపోయిందని పార్టీ నేతలు అంటున్నారు.

17 నెలల పాటు జైల్లో ఉన్న సిసోడియా

ఇకపోతే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెల‌ల పాటు సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు. సిసోడియాను ఫిబ్రవరి 26, 2023న సీబీఐ అరెస్టు చేసింది. రెండు వారాల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అతడ్ని అరెస్టు చేసింది. అయితే, ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ లేకుండా "అపరిమిత కాలం" జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంది.


Similar News