అయోధ్య రామాలయం పైకప్పు లీక్ అవలేదు: ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ స్పష్టత

ఆలయ పైకప్పు నుంచి నీరు కారుతోందన్న ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను ఖండించారు.

Update: 2024-06-26 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం గర్భాలయంలో నీరు లీకైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంసమైంది. దీనిపై స్పందించిన ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా.. చిన్నపాటి వర్షానికే ఆలయ పైకప్పు నుంచి నీరు కారుతోందన్న ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను ఖండించారు. పైకప్పు లీక్ అవ్వలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల నుంచి వర్షం నీరు వచ్చిందని మిశ్రా స్పష్టం చేశారు. ఆలయంలో నీళ్ల లీకేజీకి అవకాశం లేదు. కరెంట్ వైర్ల కోసం అమర్చిన పైపుల నుంచి నీరు ఆలయం లోపలికి వచ్చిందని, తాను స్వయంగా ఆలయ భవనాన్ని పరిశీలించానని ఆయన వివరించారు. ప్రస్తుతం రెండో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే వర్షపు నీరు ఆలయంలోకి రావడం నిలిచిపోతుందని మిశ్రా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని వర్షపు నీరు బయటకు పోయేలా ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. విగ్రహం ఎదురుగా పూజారి కూర్చునే చోటు, వీఐపీ దర్శనం కోసం భక్తులు వేచి ఉండే ప్రదేశం వరకు పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందని ఆయన తెలిపారు. దేశ నలుమూలల నుంచి ఇంజనీర్లు ఆలయ నిర్మాణంలో ఉన్నారు. అయినా వర్షపు నీరు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా తప్పు అని అన్నారు. కాగా, ఆలయ నిర్మాణ గురించి నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. మొదటి అంతస్తు పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని చెప్పారు. డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News