Mann Ki Baat: యానిమేషన్, గేమింగ్ రంగాలపై ప్రశంసలు కురిపించిన మోడీ
యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ‘మన్‌కీ బాత్’ 115వ ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగించారు.
దిశ, నేషనల్ బ్యూరో: యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ‘మన్‌కీ బాత్’ 115వ ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగించారు. దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. యానిమేషన్, గేమింగ్ ఫ్యాక్టరీలపై ప్రశంసలు కురిపించారు. ఛోటా భీమ్ తరహాలోనే ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, మోటు-పత్లు, బాల్ హనుమాన్‌లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కంటెంట్, సృజనాత్మకత కారణంగా భారతీయ యానిమేటెడ్ పాత్రలు, చలనచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియా’ అనేవి యానిమేషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయని అన్నారు. ‘స్వయం సమృద్ధి అనేది విధానం కాదు.. అభిరుచి. కొన్నేళ్ల క్రితం భారత్‌లో ఏదైనా క్లిష్టమైన సాంకేతికత అభివృద్ధి చెందుతుందంటే ఎవరూ నమ్మేవారు కాదు. అపహాస్యం చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి రంగంలోనూ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతున్నారు‘ అని మోడీ అన్నారు. ‘వర్చువల్ రియాలిటీ టూరిజం ప్రసిద్ధి చెందుతోంది. అక్టోబర్ 28న ‘వరల్డ్ యానిమేషన్ డే’ జరుపుకోనున్నాం. భారత్‌ను గ్లోబల్ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు సంకల్పించాలి’ అని పిలుపునిచ్చారు.
ఆన్ లైన్ మోసాలపై
డిజిటల్ అరెస్టులు, ఆన్ లైన్ స్కాంలు, డిజిటల్ మోసాలపై ఆందోళన వద్దని మోడీ ప్రజలకు సూచించారు. ఇలాంటి సందర్భం ఎదురైతే కాసేపు ఆగి, ఆలోచించి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయన్నారు. డిజిటల్ మోసాలకు సంబంధించిన వీడియోను ప్లే చేసిన ఆయన.. ఏ దర్యాప్తు సంస్థలు ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను సంప్రదించవన్నారు. నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తే 1930 నంబర్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ సాయంతో ఫిర్యాదు చేయాలన్నారు.
ఇద్దరు హీరోల గురించి
దేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని మోడీ చెప్పారు. మన్ కీ బాత్‌లో ధైర్యం, దూరదృష్టి కలిగిన ఇద్దరు గొప్ప హీరోల గురించి చర్చిస్తాను అని ఆయన అన్నారు. అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి.. నవంబర్ 15 బిర్సా ముండా జయంతి జరగనుంది. ఈ ఇద్దరు మహానుభావుల ముందున్న సవాళ్లు భిన్నమైనవయినా.. వారి దృష్టి ఒక్కటే.. అదే దేశ సమైక్యత అని ప్రధాని పేర్కొన్నారు. ‘నా జీవితంలో మరచిపోలేని క్షణాలు ఏవి అని మీరు నన్ను అడిగితే, చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైనది. అది గత ఏడాది నవంబర్ 15న బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామానికి వెళ్లాను. ఈ ప్రయాణం నాపై చాలా ప్రభావం చూపింది’ అని మోడీ అన్నారు