India: భారత్-సింగపూర్ మంత్రివర్గ రౌండ్‌టేబుల్‌లో కీలక రంగాలపై చర్చ
కీలక ఆరు అంశాలపై ఇరు పక్షాలు చర్చించినట్టు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-సింగపూర్ దేశాల మంత్రుల రెండో రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం సింగపూర్‌లో జరిగింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమావేశానికి ఇరు దేశాల నేతలు హాజరయ్యారు. ఇందులో అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తు రంగాల్లో పరస్పర సహకారం అందిపుచ్చుకునే మార్గాలపై చర్చించారు. ప్రధానంగా డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, సస్టైనబిలిటీ, హెల్త్‌కేర్ అండ్ మెడిసిన్, అడ్వాన్స్‌డ్ మాన్యూఫాక్చరింగ్, కనెక్టివిటీ వంటి కీలక ఆరు అంశాలపై ఇరు పక్షాలు చర్చించినట్టు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఈ అరడజను ఒప్పందాలను ఇరుపక్షాలు ఖరారు చేశాయని, వీటిని వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్‌లో సందర్శించినప్పుడు ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. రౌండ్ టేబుల్ మొదటి రౌండ్‌లో జరిగిన చర్చల ఫలితంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సహకారం, సెమీకండక్టర్ వ్యవస్థల సహకారంపై అవగాహన ఒప్పందాలు విజయవంతమయ్యాయని నేతలు పేర్కొన్నారు. భారత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రౌండ్‌టేబుల్‌లో పాల్గొన్నారు.
ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సహకార సమీక్షలో అధునాతన తయారీ, సెమీకండక్టర్లు, విమానయానం, సముద్ర కనెక్టివిటీ అంశాలపై మంత్రివర్గ యంత్రాంగం చర్చించాయి. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆయా రంగాలు రెండు దేశాలకు, వ్యాపారాలకు కీలకమైన అవకాశాలను అందించనున్నాయి. త్వరలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. దాదాపు 1,000 కొత్త విమానాల కోసం భారతీయ విమానయాన సంస్థలు ఆర్డర్లు చేయడంతో భారత విమానయాన రంగంలో అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.