Maharashtra: కౌన్ బనేగా ‘మహా’ సీఎం?.. ఓట్ల లెక్కింపునకు ముందే మొదలైన డిస్కషన్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇలా పూర్తయ్యాయో లేదో.. అలా సీఎం సీటుపై డిస్కషన్ మొదలైంది. మహారాష్ట్రలో సీఎం సీటు విషయమై ప్రభుత్వాలే కూలిపోయాయి. సీఎం, డిప్యూటీ సీఎం పోస్టు కోసమూ ఈక్వేషన్లు మారాయి, పార్టీలే చీలిపోయాయి.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra Assembly Elections) ఇలా పూర్తయ్యాయో లేదో.. అలా సీఎం సీటు(CM Seat)పై డిస్కషన్ మొదలైంది. మహారాష్ట్రలో సీఎం సీటు విషయమై ప్రభుత్వాలే కూలిపోయాయి. సీఎం, డిప్యూటీ సీఎం పోస్టు కోసమూ ఈక్వేషన్లు మారాయి, పార్టీలే చీలిపోయాయి. ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీ ఏ పక్షంవైపు మళ్లుతుందో తెలియని పరిస్థితి. ప్రీపోల్ అలయెన్స్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి సందర్భంలో మహాయుతి(Mahayuti), మహావికాస్ అఘాడీ(Mahavikash) పక్షాల పార్టీలు సీఎం సీటు తమదేనని పార్టీలు ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారుతున్నది. ఎగ్జిట్ పోల్స్‌ను సీరియస్‌గా తీసుకోని పార్టీలు తమ కూటమికే మెజార్టీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహాయుతి కూటమిలోని శివసేన, బీజేపీ, ఎన్సీపీ, మహావికాస్ అఘాడీ పార్టీలు కాంగ్రెస్, శివసేనలూ సీఎం సీటుపై ఇది వరకే కామెంట్లు చేశాయి.
పోలింగ్ పూర్తవ్వగానే మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ నాయకత్వంతో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని కామెంట్ చేయగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన కరుకుగానే రియాక్ట్ అయింది. మెజార్టీ సీట్లు గెలిచిన తర్వాత కూటమి పార్టీలు సంయుక్తంగా సీఎంను డిసైడ్ చేస్తారని శివసేన(యూబీటీ) సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. ఒక వేళ పటోలేనే సీఎం ఫేస్ అని హైకమాండ్ చెబితే.. ఆ విషయాన్ని రాహుల్, సోనియా, ప్రియాంక ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు సీఎం సీటు ప్రకటనపై కాంగ్రెస్, ఠాక్రే పార్టీ మధ్య కయ్యం జరిగిన విషయం తెలిసిందే.
మహాయుతి వైపున శివసేన ఎమ్మెల్యే, ప్రతినిధి సంజయ్ షిర్సాత్ మాట్లాడుతూ ఎన్నికలకు సీఎం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోనే వెళ్లామని, ప్రజలూ ఆయనను చూసే ఓట్లు వేశారన్నారు. కాబట్టి సీఎం కావడం షిండే హక్కు అని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. బీజేపీ నుంచి సీఎం చాన్స్ కేవలం దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఉంటుందని ఆ పార్టీ నేత ప్రవీన్ డరేకర్ స్పష్టం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా కింగ్‌మేకర్ మాత్రం ఎన్సీపీ(అజిత్ పవార్) అని ఆ పార్టీ నేత అమోల్ మిట్కారీ చెప్పారు. ఈ విషయాలపై దేవేంద్ర ఫడ్నవీస్ రియాక్ట్ అవుతూ మహాయుతి కూటమి సమావేశమై మంచి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మహాయుతికే అధికారం దక్కుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. కొన్ని మాత్రం మహావికాస్ అఘాడీవైపు మొగ్గాయి.
మహారాష్ట్ర మాదే: డీకే శివకుమార్
ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ తప్పని తేలిపోతాయని, మహారాష్ట్రలో గెలిచేది కాంగ్రెస్ కూటమేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో స్వల్పతేడాతో ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా చెప్పారని గుర్తు చేశారు. తాను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లారని, అక్కడి నాయకులతోనూ మాట్లాడినాకే ఈ విషయం చెబుతున్నట్టు తెలిపారు.
అధికారంవైపే ఉంటాం: ప్రకాశ్ అంబేద్కర్
ఒక పార్టీకి లేదా కూటమికి మద్దతు తెలిపేస్థాయిలో వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీకి సీట్లు వస్తే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కూటమికే సపోర్ట్ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు. అధికారంవైపే ఉంటామని స్పష్టం చేశారు.