UCC: దేశంలో యూసీసీ అవసరం.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై చర్చ జరుగుతున్న వేళ కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై చర్చ జరుగుతున్న వేళ కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో యూసీసీ అవసరమని, ఈ చట్టాన్ని రూపొందించడానికి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు సమిష్టిగా చొరవ తీసుకోవాలని తెలిపింది. మరణించిన ఓ ముస్లిం భర్త, ఆమె తోబుట్టువుల మధ్య ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో సివిల్ అప్పీల్ పై తీర్పు చెబుతూ జస్టిస్ హంచతే సంజీవ్ కుమార్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ సిఫార్సు చేసింది. ‘దేశంలో వ్యక్తిగత చట్టాలు, మతానికి సంబంధించిన ఏకరీతి పౌర నియమావళి అవసరం. అప్పుడే భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్టికల్ 14 లక్ష్యం సాధ్యమవుతుంది’ అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఒకే పౌర నియమావళిని అమలు చేస్తే ప్రవేశికలో పొందుపరచబడిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, జాతీయ సమైక్యత అనే ఆదర్శాలను నెరవేరుస్తుందని జస్టిస్ కుమార్ తెలిపారు.
రాజ్యాంగం ప్రకారం దేశంలోని మహిళలంతా సమాన పౌరులు అయినప్పటికీ, మతం ఆధారిత వ్యక్తిగత చట్టాల కారణంగా వారు అసమానంగా చూడబడుతున్నారని స్పష్టం చేశారు. హిందూ ట్టం ప్రకారం కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కులు దక్కుతుండగా ముస్లిం చట్టం తేడాను చూపుతుందన్నారు. కాబట్టి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమని నొక్కి చెప్పారు. గోవా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే యూసీసీ అమలుకు చర్యలు తీసుకున్నాయని, దీనిని దేశమంతా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది. తన తీర్పు కాపీని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపించాలని కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.