Preamble : రాజ్యాంగంలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలు.. 25న కీలక తీర్పు

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ ప్రవేశిక(Preamble)లో సామ్యవాదం (socialist), లౌకికవాదం (secular) అనే పదాలను చేరుస్తూ 1976లో 42వ రాజ్యాంగ సవరణను చేశారు.

Update: 2024-11-22 13:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ ప్రవేశిక(Preamble)లో సామ్యవాదం (socialist), లౌకికవాదం (secular) అనే పదాలను చేరుస్తూ 1976లో 42వ రాజ్యాంగ సవరణను చేశారు. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, బలరాం సింగ్, అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం (నవంబరు 25న) తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. ఈక్రమంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు వినే క్రమంలో సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ‘సెక్యులరిజం’ అనేది ఒక అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇదే వ్యాఖ్యానం చేస్తూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘సోషలిస్ట్ అనే పదానికి ఇతర దేశాల్లో అర్థం వేరేది ఉండొచ్చు. కానీ మన దేశంలో మాత్రం ‘సంక్షేమ రాజ్యం’ అనే కోణంలో దాన్ని పరిగణిస్తాం. సోషలిజం అనే పదం రాజ్యాంగంలో ఉన్నా.. ప్రైవేటు రంగాన్ని మనదేశంలో ఎన్నడూ నిలువరించలేదు. పైగా ఆ రంగం వారికి ప్రయోజనాలనే అందించాం. సోషలిజం అందించిన సంక్షేమ రాజ్య భావనతో దేశ ప్రజలకు సమాన అవకాశాలను కల్పిస్తున్నాం’’ అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు.

విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు నో

‘‘ఎమర్జెన్సీ టైంలో భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టపరంగా చెల్లవని మేం చెప్పలేం. ప్రత్యేకించి 42వ రాజ్యాంగ సవరణ చేయడానికి ముందు న్యాయపరమైన కసరత్తు చాలానే జరిగింది’’ అని ఆయన తెలిపారు. ఈసందర్భంగా అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వాదన వినిపిస్తూ.. ‘‘42వ రాజ్యాంగ సవరణ చేసే క్రమంలో ఆనాడు దేశంలోని రాష్ట్రాల ఆమోదాన్ని తీసుకోలేదు. దీనిపై అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌ల అభిప్రాయాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకుంటే బాగుంటుంది’’ అని కోరారు. ఈ పిటి‌షన్లపై విచారణకు ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అయితే అందుకు సీజేఐ సంజీవ్ ఖన్నా నిరాకరించారు.

సుబ్రమణ్య స్వామి వాదన..

బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వాదన వినిపిస్తూ.. ‘‘రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చడాన్ని గతంలో జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్ధించింది. 1949వ సంవత్సరాన్ని ప్రస్తావిస్తూ సోషలిస్ట్, సెక్యులర్ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు. అయితే ఈ పదాలను ఒక ప్రత్యేక పేరాలో ప్రస్తావిస్తే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ వాదనలన్నీ పూర్తయ్యాక.. ‘‘సోమవారం తీర్పు కోసం దీన్ని లిస్ట్ చేయండి’’ అని సీజేఐ ఆదేశాలిచ్చారు. ఈక్రమంలో పిటిషనర్ బలరాం సింగ్ తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ జోక్యం చేసుకుంటూ.. ‘‘దయచేసి మా పిటిషన్‌ను డిస్మిస్ చేయకండి. కొంచెం మా మొర వినండి’’అని చెప్పారు. దీనికి సీజేఐ బదులిస్తూ.. ‘‘అవును.. అవును.. మేం మిమ్మల్ని విన్నాం. సోమవారం (నవంబరు 25న) తీర్పు ఇస్తాం’’ అని తెలిపారు.

Tags:    

Similar News