రాహుల్ చైనా రాజ్యాంగాన్ని కలిగి ఉన్నారు: అస్సాం సీఎం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన ర్యాలీలో ఎరుపు రంగు కవర్ కలిగిన రాజ్యాంగం కాపీని చూపించడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర విమర్శలు చేశారు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన ర్యాలీలో ఎరుపు రంగు కవర్ కలిగిన రాజ్యాంగం కాపీని చూపించడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీకి నీలిరంగు కవర్ ఉంటుంది. చైనా రాజ్యాంగానికి ఎరుపు రంగు కవర్ ఉంటుంది. అంటే రాహుల్ చైనా రాజ్యాంగాన్ని కలిగి ఉన్నారా? మేము ధృవీకరించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కోడ్ రెడ్ మూమెంట్ ఇదేనా? అని రాహుల్‌పై అస్సాం సీఎం సోషల్ మీడియా ఎక్స్‌లో విమర్శలు చేశారు.
మన రాజ్యాంగంలో నీలి రంగు అనేది రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు అనే అధ్యాయం ఉంది, ఇది మన దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడం పవిత్ర విధి అని సూచిస్తుంది, కానీ దీన్ని రాహుల్ వ్యతిరేకిస్తున్నాడు. అందుకే ఆయన చేతిలో ఉన్న రాజ్యాంగం కచ్చితంగా చైనాదేనని హిమంత బిస్వా శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అస్సాం సీఎం చేసిన పోస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ మోండల్, రాజ్యాంగంలో అనేక రంగులు ఉన్నాయి, కానీ లోపల ఉన్న విషయాలు ఒకేలా ఉంటాయని అన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హఫీజ్ రఫీకుల్ మీడియాతో మాట్లాడుతూ, భారత రాజ్యాంగానికి నిర్ణీత రంగు లేదు. ముఖ్యమంత్రి కూడా ఎరుపు రంగు కండువా ధరించారు.. మరి అది కూడా చైనా దేనా? అని ప్రశ్నించారు. అంతకుముందు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాహుల్ అమేథీలో ఉమ్మడి బహిరంగ ర్యాలీలో, రాజ్యాంగం కాపీని పట్టుకుని, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులను అణగదొక్కడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.