భోజ్‌షాలా-కమల్ మౌలా కాంప్లెక్స్‌పై నివేదిక.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు అందజేసిన ఏఎస్ఐ
వాదాస్పద భోజ్‌షాలా-కమల్ మౌలా మసీదు సముదాయంపై నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మధ్యప్రదేశ్ హైకోర్టుకు సోమవారం అందజేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద భోజ్‌షాలా-కమల్ మౌలా మసీదు సముదాయంపై నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మధ్యప్రదేశ్ హైకోర్టుకు సోమవారం అందజేసింది. సర్వేలో వివిధ కాలాలకు చెందిన వెండి, రాగి, అల్యూమినియం, ఉక్కుతో తయారు చేసిన మొత్తం 31 నాణేలు దొరికాయని నివేదిక పేర్కొంది. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10వ-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తాన్లు (13వ-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15వ-16వ శతాబ్దం), మొఘల్స్ (16వ-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్ (19వ-20వ శతాబ్దం)కి చెందినవిగా తెలిపింది. అలాగే సర్వేలో మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణ అంశాలు కూడా బయటపడ్డాయి. ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, స్కిస్ట్, మృదువైన రాయి, ఇసుకరాయి మరియు సున్నపురాయితో తయారు చేసినట్టు తెలుస్తోంది. అవి గణేష్, బ్రహ్మ, నరసింహ, భైరవ, ఇతర దేవతలు, మానవులు, జంతువుల వంటి దేవతల బొమ్మలను వర్ణించనున్నట్టు ఏఎస్ఐ పేర్కొంది. జంతువుల బొమ్మలలో సింహాలు, ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, కోతులు, పాములు, తాబేళ్లు, హంసలు, పక్షులు ఉన్నాయి.
కాగా, ఈ బోజ్ శాల కాంప్లెక్స్‌పై హిందూ ముస్లింల మధ్య వివాదం ఉంది. హిందూ సమాజం11వ శతాబ్దపు స్మారక చిహ్నమైన భోజ్‌శాలను వాగ్దేవి (సరస్వతి దేవి) ఆలయంగా పరిగణిస్తుంది. అయితే ముస్లిం పక్షం దీనిని కమల్ మౌలా మసీదుగా పిలుస్తుంది. గత 21 ఏళ్లుగా, హిందువులు భోజ్‌శాలలో మంగళవారం పూజలు చేయడానికి, శుక్రవారాల్లో నమాజ్ చేయడానికి ముస్లింలకు అనుమతి ఉంది. అయితే హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఈ విధానంపై హైకోర్టులో సవాలు చేసింది. దీంతో ఇక్కడ శాస్త్రీయ సర్వే నిర్వహించాలని మార్చి 11న హైకోర్టు ఏఎస్ఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సర్వే చేపట్టిన ఏఎస్ఐ తాజాగా నివేదికను అందజేసింది. దీనిపై కోర్టు జూలై 22న విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.