Ashwini Vaishnaw: రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

Update: 2024-10-04 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రైల్వేలను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శుక్రవారం ఆయన నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 400 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రజలు 1,000 కిలోమీటర్ల వరకు సౌకర్యంగా ప్రయాణించేలా చూడడమే తమ ధ్యేయమని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైల్వేలు పూర్తి స్థాయిలో మారిపోతాయని తెలిపారు. వందే భారత్, నమో భారత్, కవచ్ రైలు రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటి వాటి వల్ల అనేక మార్పులకు దారి తీస్తాయన్నారు.

రైల్వేలను ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని, ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైల్వే, రక్షణ రెండు భారతదేశానికి రెండు వెన్నెముకలని కొనియాడారు. రైల్వే రాజకీయీకరణ ఆగిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, పనితీరు, భద్రత, సాంకేతికతతో అందరికీ మంచి సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. గత పదేళ్లలో 31 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేశామని, ఇది ఫ్రాన్స్ నెట్‌వర్క్ కంటే ఎక్కువని తెలిపారు. రైల్వే బడ్జెట్ ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్లుగా ఉందన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) గురించి మాట్లాడుతూ వాటిని అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.35 కోట్లు కేటాయించామని, సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు సంబంధించిన పలు డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 


Similar News