కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం.. డీకేకు షాకిచ్చిన సిద్దరామయ్య!
మే 10న ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: మే 10న ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోసారి అధికారంలో కొనసాగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ విజయానికి అనుకూలత ఉందని ఒపీనియన్ పోల్ సర్వేలు చెబుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తానే సీఎం పదవీ రేస్‌లో ఉన్నానని గురువారం సిద్దరామయ్య ప్రకటించుకున్నారు. దీంతో గత ఐదేళ్లుగా పీసీసీ హోదాలో పార్టీని ముందుండి నడిపించిన డీకే శివకుమార్‌కు షాక్ తగిలినట్టైంది. ఈసారి పార్టీ అధికారం చేపట్టే పరిస్థితి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతాననే ఆశల్లో డీకే ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.
సీఎం పోస్ట్ విషయంలో డీకే, సిద్దు మధ్య చాలా రోజులుగా అప్రకటిత వార్ నడుస్తోందనే చర్చ కూడా ఉంది. ఇంతలో సిద్ధరామయ్య చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు కర్ణాటకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వరుస పర్యటనలతో కాంగ్రెస్‌లో వర్గ పోరును టార్గెట్ చేస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి ఎవరనేది పైకి చెప్పకుండా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే కాంగ్రెస్‌లో మాత్రం తానే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడం దుమారం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాట మొదలైతే అది చేతికందబోయే అధికారాన్ని నేలపాలు చేసుకోవడమే అవుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మరి ఈ ఇష్యూను అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది.