ప్రధాని ర్యాలీలో మరో అనూహ్య ఘటన.. సైనికుడినంటూ వీవీఐపీ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు యత్నం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో ఇటీవల భద్రతా వైఫల్యం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో అనూహ్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో ఇటీవల భద్రతా వైఫల్యం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో అనూహ్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో గురువారం జరిగిన ప్రధాని మోడీ రోడ్‌షోలో తాను సైనికుడిని అంటూ ఓ వ్యక్తి ప్రధాని ర్యాలీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) వద్దకు మోడీ చేరుకోవడానికి 90 నిమిషాల ముందు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
పోలీసులు వివరాల ప్రకారం..గార్డ్స్ రెజిమెంట్ ఆఫ్ ఆర్మీలో నాయక్‌నంటూ ఓ వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) పేరుతో నకిలీ గుర్తింపు కార్డును ఉపయోగించి అత్యంత భద్రత తో కూడిన వీవీఐపీ ప్రాంతంలో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని నవీ ముంబయికి చెందిన సైన్స్ గ్రాడ్యుయేట్ రామేశ్వర్ మిశ్రా (35)గా పోలీసులు గుర్తించారు.
అయితే అతను ర్యాలీలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో ముంబయి క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది గ్రౌండ్ ప్రవేశ ద్వారం వద్దే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం వేషాధరణ, ఫోర్జరీ ఆరోపణలపై నిందితుడిని అరెస్టు చేశారు. అంతేకాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 171, 465, 468, 471 కింద కేసు నమోదు చేశారు.
ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఢిల్లీ పోలీసులు, ప్రధానమంత్రి భద్రతా కార్యాలయం వంటి వివిధ ఏజెన్సీలు వీవీఐపీ విభాగంలోకి ఎందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే దాని పై విచారణ జరుపుతున్నారు. మరోవైపు, శుక్రవారం అతడిని బాంద్రా కోర్టులో హాజరుపర్చగా.. జనవరి 24 వరకు పోలీసు కస్టడీ విధించింది. కాగా, ఇదే నెలలో ప్రధాని కర్ణాటకలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది.