ఎంపీలుగా అమృతపాల్, ఇంజనీర్ రషీద్‌ల ప్రమాణం.. పేరోల్‌పై జైలు నుంచి బయటకు

జైలులో ఉండి ఎంపీలుగా విజయం సాధించిన కశ్మీరీ నేత ఇంజనీర్ రషీద్, ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్‌లు శుక్రవారం లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-07-05 12:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైలులో ఉండి ఎంపీలుగా విజయం సాధించిన కశ్మీరీ నేత ఇంజనీర్ రషీద్, ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్‌లు శుక్రవారం లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పేరోల్‌పై బయటకు వచ్చిన వీరిద్దరూ పార్లమెంట్ హౌస్‌లో ప్రమాణం చేశారు. ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇద్దరినీ పార్లమెంటులోని స్పీకర్ చాంబర్‌కు తీసుకొచ్చి కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణలపై తీహార్ జైలులో ఉన్న ఇంజనీర్ రషీద్ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ప్రమాణ స్వీకారం నిమిత్తం ఆయనకు రెండు గంటల పే రోల్ మంజూరు చేశారు.

పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన ఖలిస్తానీ వేర్పాటు వాది అమృతపాల్ సింగ్ అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. ఆయనకు నాలుగు రోజుల పే రోల్ లభించింది. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు దిబ్రూగఢ్ జైలు నుంచి అధికారులు బయటకు తీసుకొచ్చారు. అసోం విమానాశ్రమం నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకురాగా అక్కడి నుంచి పార్లమెంట్ హాల్‌కు తరలించారు. అనంతరం అమృత్ పాల్ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యేందుకు అనుమతించారు. అయితే వీరిద్దరికీ పలు షరతులతో పేరోల్ ఇచ్చారు.  


Similar News