పేపర్ లీక్ వాస్తవమే కానీ.. నీట్ వివాదంపై సుప్రీంకోర్టు కోర్టు కీలక వ్యాఖ్యలు

నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకైంది వాస్తతవమేనని సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ లీకైన ప్రశ్నపత్రం ఎంత మంది అభ్యర్థులకు చేరిందనేది తేలాల్సి ఉందని తెలిపింది.

Update: 2024-07-08 12:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకైంది వాస్తతవమేనని సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ లీకైన ప్రశ్నపత్రం ఎంత మంది అభ్యర్థులకు చేరిందనేది తేలాల్సి ఉందని తెలిపింది. పరీక్ష తిరిగి నిర్వహించడమే చివరి ఆప్షన్ అయినప్పటికీ..ఇద్దరి ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం పరీక్షను రద్దు చేయలేమని వ్యాఖ్యానించింది. నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లంటినీ సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జేబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రి సభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. లీక్ స్వభావాన్ని బట్టి పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. లీక్ పరిధి విస్తృతంగా లేకుంటే రద్దు చేయలేమని వెల్లడించింది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించాకే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

సీబీఐ, ఎన్టీఏకు నోటీసులు

పేపర్ లీక్ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీబీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను అందజేయాలని ఆదేశించింది. బుధవారం లోగా దీనిని కోర్టులో సమర్పించాలని తెలిపింది. అలాగే ప్రశ్నపత్రం లీక్‌ ఎప్పుడు జరిగింది, పేపర్లు ఎలా లీక్‌ అయ్యాయి, పేపర్‌ లీక్‌కు, పరీక్షకు మధ్య కాలవ్యవధిని వెల్లడించాలని ఎన్టీఏకు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. పేపర్ లీకేజీకి సంబంధించిన లబ్ధిదారులను గుర్తించేందుకు తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.


Similar News