కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి

ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పుల నేపథ్యంలో అధికారులు అదనపు బలగాలను పంపించారు.

Update: 2024-07-08 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాదులు దాడులు కొనసాగుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో రెండోసారి ఆర్మీ వాహనాలపై దాడులతో రెచ్చిపోయారు. తాజాగా సోమవారం కథువా జిల్లాలోని బిలావర్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి చేయగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పుల నేపథ్యంలో అధికారులు అదనపు బలగాలను పంపించారు. ఉగ్రవాదులు కొండపై నుంచి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. గ్రెనెడ్లు కూడా విసిరారని సంబంధిత అధికారులు తెలిపారు. గత కొన్ని వారాలుగా ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 11,12 తేదీల్లో దోడా జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేశారు. జూన్ 11న చత్తర్‌గలా వద్ద జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి కారణంగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, జూన్ 12న గండో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత యాంటీ-టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేసిన భద్రతా బలగాలు.. నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు.  


Similar News