తప్పుడు అత్యాచారం కేసు.. హైకోర్టు రూ.10 వేల ఫైన్

ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ తప్పుడు కేసు పెట్టింది.

Update: 2023-08-07 13:28 GMT

అలహాబాద్: ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ తప్పుడు కేసు పెట్టింది. తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. ఈ కేసు అలహాబాద్ హైకోర్టు ముందుకొచ్చింది. దీంతో తప్పుడు కేసు పెట్టిన మహిళకు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేల జరిమానా విధించిన హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. పురుషులపై తప్పుడు అత్యాచారం కేసులు పెడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందని, ఈ ధోరణిని కఠినంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. తప్పుడు, కల్పిత కథనాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని అంగీకరించడంతో బాధితురాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి క్రిమినల్ న్యాయ వ్యవస్థను సాధనంగా ఉపయోగించలేమని జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. వ్యక్తిగత వివాదాలను పరిష్కరించే సాధనంగా న్యాయ వ్యవస్థను ఉపయోగించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. నిందితుడు శివమ్ కుమార్ పాల్‌పై పెట్టిన అత్యాచారం (ఐపీసీ 306), నేరపూరిత విశ్వాస ఉల్లంఘన (ఐపీసీ 406), క్రిమినల్ బెదిరింపు (ఐపీసీ 506) కేసులను కోర్టు రద్దు చేసింది.


Similar News