Allahabad HC: భయపడే మహిళతో లైంగిక సంబంధం అత్యాచారమే.. అలహాబాద్ హైకోర్టు

లైంగిక సంబంధం పెట్టుకోవడానికి మహిళ అంగీకరించినప్పటికీ ఆ నిర్ణయం భయంతో తీసుకున్నట్టైతే అది అత్యాచారమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Update: 2024-09-16 13:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక సంబంధం పెట్టుకోవడానికి మహిళ అంగీకరించినప్పటికీ ఆ నిర్ణయం భయంతో తీసుకున్నట్టైతే అది అత్యాచారమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వివాహాన్ని సాకుగా చూపి లైంగిక దాడి చేసిన కేసులో తనపై జరుగుతున్న క్రిమినల్ చర్యలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అనిస్ కుమార్ గుప్తా ధర్మాసనం కొట్టివేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాఘవ్ కుమార్ అనే వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రా జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఐసీసీ సెక్షన్ 376 ప్రకారం రాఘవ్ పై 2018లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మహిళ భయంతో ఒప్పుకుంటే అది లైంగిక దాడే అవుతుందని తెలిపింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ రాఘవ్, మహిళ ఒకరికొకరు తెలిసిన వారని, ఇద్దరూ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారని తెలిపారు. వారు అనుమతితోనే శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారని, ఇది చాలా కాలం పాటు కొనసాగిందని చెప్పారు. కాబట్టి నేరం జరిగినట్టు కాదని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. మోసపూరిత ఆరోపణలతో కూడుకుని ఉందని, నిందితుడు బలవంతపు చర్యలకు పాల్పడ్డాడని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంది. ఈ చర్యలకు ఎటువంటి అనుమతి లేదని వెల్లడించింది. కేసును రద్దు చేయడానికి సరైన కారణం కనిపించడం లేదని తెలిపింది. 


Similar News

టమాటా @ 100