బీజేపీ హామీలన్నీ బూటకమే : ఎస్పీ నేత శివపాల్ యాదవ్ వ్యాఖ్యలు
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ బూటకపు వాగ్ధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ బూటకపు వాగ్ధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎస్పీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన సైఫాయ్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, నిరుద్యోగం, అవినీతి తారస్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కానీ బీజేపీ ఇవ్వన్నీ పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు అబద్దపు హామీలు ఇస్తుందని ఆరోపించారు. యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని తేల్చిచెప్పారు. పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని వెల్లడించారు. మిగిలిన స్థానాల్లో త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. శివపాల్ ప్రస్తుతం బుదౌన్ స్థానం నుంచి బరిలో నిలిచారు. అయితే బుదౌన్ నుంచి ఆయన కుమారుడు బరిలో దిగుతారని ఊహాగానాలు రాగా వాటిని ఆయన కొట్టి పారేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం 80లోక్ సభ సీట్లకు గాను 63 స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎస్పీ 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా..కాంగ్రెస్ 9మంది అభ్యర్థులను ప్రకటించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 62 స్థానాల్లో గెలుపొందింది.