అఖిలేష్ యాదవ్ నామినేషన్: యూపీలోని కన్నౌజ్ నుంచి పోటీ
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రామ్ గోపాల్ యాదవ్ సహా పార్టీ నేతల సమక్షంలో అఖిలేష్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రామ్ గోపాల్ యాదవ్ సహా పార్టీ నేతల సమక్షంలో అఖిలేష్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్ మేనల్లుడు తేజ్ ప్రతాప్‌కు మొదటి టికెట్ ఇచ్చారు. అయితే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ తానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2000లో తొలిసారిగా కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన అఖిలేష్ ఆ తర్వాత 2004, 2009లోనూ అదే స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. నామినేషన్ అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల పోకడలు చూసి బీజేపీ నేతల భాష మారిపోయిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యపై బీజేపీ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. కన్నౌజ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఎస్పీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. బీజేపీకి కన్నౌజ్‌లో డిపాజిట్ కూడా దక్కకపోవచ్చన్నారు.