'మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు.. నాదే ఎన్సీపీ'

Update: 2023-10-06 17:11 GMT

న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) పేరు, గుర్తుపై ఆ పార్టీలోని శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఎదుట వాదనలు వినిపించాయి. శరద్ పవార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, అజిత్ పవార్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఎన్‌కే కౌల్, మణీందర్ సింగ్ హాజరయ్యారు. మహారాష్ట్రలోని 53 మంది ఎమ్మెల్యేలలో 42 మంది, తొమ్మిది మంది ఎమ్మెల్సీలలో ఆరుగురు, నాగాలాండ్‌లోని మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు, రాజ్యసభ, లోక్‌సభ నుంచి చెరో సభ్యుడు అజిత్ పవార్ వెంటనే ఉన్నారని ఆయన తరఫు లాయర్లు వాదన వినిపించారు.

మెజారిటీ ప్రజాప్రతినిధులు తమవైపే ఉన్నందున ఎన్సీపీ పేరు, గుర్తులపై హక్కులను తమకే కేటాయించాలని.. అజిత్ పవార్ వెంట ఉన్నదే సిసలైన ఎన్సీపీ అని పేర్కొన్నారు. అజిత్ పవార్ వర్గం వాదనలు సోమవారం (అక్టోబరు 9న) కూడా కొనసాగనున్నాయి. ఈ విచారణ అనంతరం శరద్ పవార్ తరపు న్యాయవాది సింఘ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ చేసిన వాదనలు ఊహాజనితంగా ఉన్నాయన్నారు.


Similar News