ఎన్సీపీ సింబల్, పార్టీ కోసం ఈసీని ఆశ్రయించిన అజిత్ పవార్
అజిత్ పవార్ తిరుగుబాటుతో తీవ్ర షాక్ లో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మరో షాక్ తగిలేలా ఉంది.
దిశ, వెబ్ డెస్క్: అజిత్ పవార్ తిరుగుబాటుతో తీవ్ర షాక్ లో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మరో షాక్ తగిలేలా ఉంది. తాజాగా తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ సింబల్, పార్టీ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. తమకే ఆ రెండింటిని కేటాయించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. కాగా అంతకు ముందే పార్టీ, పార్టీ సింబల్ పై తమకే పూర్తి అధికారం ఉందంటూ శరద్ పవార్ వర్గం కేవియట్ దాఖలు చేసింది. తమకే 35 మంది ఎమ్మల్యేలు ఉన్నారని శరద్ పవార్ వర్గం తెలిపింది. కాగా మూడు రోజుల కిందట ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరగా.. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం, మరో 9మంది మంత్రి పదవులు దక్కించుకున్నారు.
ఇక గతేడాది కూడా శివసేనలో ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. ఏక్ నాథ్ షిండే శివసేన నుంచి విడిపోయి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో అప్పుడు సీఎంగా ఉన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పదవి నుంచి దిగిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల్లో శివసేన గుర్తు, పార్టీని షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాలు చూస్తే ఎన్సీపీలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని శరద్ పవార్ మండిపడ్డారు. అజిత్ పవార్ పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏం లేదని ఆయన అన్నారు.