INS Vikrant: మెరైన్ రఫేల్స్ యుద్ధవిమానాల డీల్ కి తుది ధర ఖరారు
మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాల డీల్ కి సంబంధించిన తుది ధర ఖరారైంది. దీనికి సంబంధించిన తుదిధరను ఫ్రాన్స్ భారత్ కు వెల్లడించింది.
దిశ, నేషనల్ బ్యూరో: మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాల డీల్ కి సంబంధించిన తుది ధర ఖరారైంది. దీనికి సంబంధించిన తుదిధరను ఫ్రాన్స్ భారత్ కు వెల్లడించింది. భారత నేవీ వార్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. వీటి ధర విషయంలో భారత్ పట్టుబట్టడంతో ప్రయోజనం అంతగా లేదని వార్తలొచ్చాయి. కానీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటనకు కొద్దిగా ముందే ఈ వివరాలు రావడం విశేషం. గత వారం ఫ్రాన్స్, భారత్ కు చెందిన ప్రతినిధుల బృందాలు ఢిల్లీలో చర్చలు జరిపాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సహా వివిధ స్థావరాలపై మోహరించేందుకు 26 రాఫెల్ మెరైన్ జెట్‌లను కొనుగోలు చేయడానికి భారత్, ఫ్రాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్యారిస్ లో జరిగే భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక చర్చల్లో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ పాల్గొననున్నారు.
ఫ్రాన్స్ కు చెల్లింపులు
భారత నేవీ సరికొత్త విమాన వాహక నౌకను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు ఈ డీల్ చాలా ముఖ్యం. దీంతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ విధానంలో యుద్ధ విమానాల కొనుగోళ్లకు చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భారత్ అభివృద్ధి చేసిన ఉత్తమ్ రాడార్‌ను కూడా విమానాల్లో అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 8 ఏళ్ల సమయం పడుతుందని.. అదే సమయంలో ఫ్రాన్స్‌కు చెల్లింపులు కూడా చేయాల్సివస్తుంది. దీంతోపాటు, విమానంలో స్వదేశీ ఆయుధాలను అనుసంధానం చేయాలని ఫ్రాన్స్‌ను భారత్ కోరింది. దేశీయంగా తయారుచేసిన అస్త్ర, రుద్రం క్షిపణులను కూడా ఈ విమానాలకు ఇంటిగ్రేడ్ చేయాలని అభ్యర్థించింది. దీంతోపాటు వాయుసేనకు అవసరమైన 40 డ్రాప్ ట్యాంక్‌ల కొనుగోలు, స్వల్ప సంఖ్యలో వర్క్‌స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇకపోతే, ఈ డీల్ ధర ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన రేటుపై ఒప్పందాలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా భారత వైమానిక దళం కోసం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం మునుపటి ఒప్పందాన్ని ప్రాతిపదికగా ఉపయోగించుకుంటుంది.