Jammu and Kashmir: రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు(Jammu and Kashmir Assembly elections) ముందు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Update: 2024-09-14 04:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు(Jammu and Kashmir Assembly elections) ముందు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని(Baramulla) చక్ తాపర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు కాల్పులు జరిగాయి. దీంతో, ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి కథువాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

కిష్ట్వార్ లో ఇద్దరు జవాన్లు మృతి

మరోవైపు, శుక్రవారం కిష్ట్వార్ లో(Kishtwar district) జరిగిన ఎన్ కౌంటర్(Encounter)లో ఇద్దరు ఆర్మీ అధికారులు అమరులయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు, భద్రతా బలగాల ఉమ్మడి ఆపరేషన్ లో భాగంగా నైద్ గాం ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో కిష్త్వార్ లో కాల్పులు జరిగాయి. సమీపంలోని అడవుల్లో దాక్కున్న ముష్కరులు భద్రతా సిబ్బందిని చూసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. అయితే, ఆ కాల్పుల్లో నలుగురు జవాన్లు గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని.. ఆపరేషన్ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

బసంత్ గఢ్ లో ఎన్ కౌంటర్

బుధవారం కతువా-ఉధంపూర్ సరిహద్దు సమీపంలోని బసంత్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పారామిలటరీ దళాలు, పోలీసు సిబ్బంది బసంత్ గఢ్ కు చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో, భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది గాయపడిన కొద్ది గంటల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.


Similar News