Adani: అదానీ అరెస్టుపై యూఎస్ నుంచి ఎలాంటి విజ్ఞప్తి అందలేదు: కేంద్ర విదేశాంగ శాఖ
పారిశ్రామికవేత్త గౌతం అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలిసారి స్పందించింది.
దిశ, నేషనల్ బ్యూరో: పారిశ్రామికవేత్త గౌతం అదానీ (Gautam Adani)పై అమెరికా (America) ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలిసారి స్పందించింది. అదానీపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ గురించి యూఎస్ అధికారుల నుంచి ఎటువంటి అభ్యర్థన రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadheer Jaiswal) తెలిపారు. ప్రతీవారం నిర్వహించే మీడియా సమావేశంలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడారు. అదానీ గ్రూపునకు సంబంధించిన చట్టపరమైన చర్యల్లో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని చెప్పారు. ఈ సమస్య ప్రయివేట్ సంస్థలకు సంబంధించినదని తెలిపారు. అటువంటి కేసులకు కొన్ని విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉన్నాయని వీటిని పాటిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. అదానీ వ్యవహారాన్ని భారత ప్రభుత్వానికి ముందస్తుగా తెలియజేయలేదని, ఈ విషయంపై అమెరికా ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదన్నారు. కాగా, భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని అమెరికా న్యాయ శాఖ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.