Actor Vijay: పెను తుఫాన్ రాబోతోంది- నటుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ఎన్నికల ముందు తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధినేత, నటుడు విజయ్ దూకుడు కనబరుస్తున్నారు. తమిళనాడు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ఎన్నికల ముందు తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధినేత, నటుడు విజయ్ దూకుడు కనబరుస్తున్నారు. తమిళనాడు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం తిరువన్మయూర్‌లో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay) పాల్గొని పసంగించారు. డీఎంకే, ప్రధాని మోడీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని నిప్పులు చెరిగారు. డీఎంకే.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుందన్నారు. సాధరణ గాలిని ఆపితే.. అది శక్తిమంతమైన తుపానుగా మారుతుందని సినిమా స్టైల్లో డైలాగ్ వేశారు. పెనుతుపాను రాబోతుందని అధికార పార్టీని హెచ్చరించారు.
17 తీర్మానాలకు ఆమోదం
ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరాలని పార్టీ నిర్ణయించింది. తాము ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. విద్యావిధానంలో మూడు భాషల విధానం అమలు ప్రతిపాదన ఫెడరలిజానికి విరుద్ధమని, దీన్ని ఎప్పటికీ తాము అంగీకరించమని స్పష్టం చేసింది. డీలిమిటేషన్ (Delimitation) కారణంగా దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని తీర్మానంలో పేర్కొంది. తమిళనాడులో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని, దీన్ని నియంత్రించడంలో అధికార డీఎంకే ప్రభుత్వం విఫలమైందని టీవీకే తీర్మానంలో ఆరోపించింది. ఉద్యోగులకు పాత పెన్షన్ పథకంపై డీఎంకే తప్పుడు వాగ్దానాలు చేస్తోందని పేర్కొంది. శ్రీలకంలో అరెస్టయిన భారతీయ మత్స్యకారులకు అండగా ఉంటామంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, జమిలి ఎన్నికలపైనా విమర్శలు గుప్పించారు.