పూణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం: అజిత్ పవార్

ఇటీవల పూణేలో మద్యం మత్తులో ఒక మైనర్ ఖరీదైన పోర్షే కారుతో బైక్‌ను ఢీకొట్టగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-01 07:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పూణేలో మద్యం మత్తులో ఒక మైనర్ ఖరీదైన పోర్షే కారుతో బైక్‌ను ఢీకొట్టగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తరువాత పూణే ఎమ్మెల్యే సునీల్ టైగ్రే ఆ మైనర్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులకు సూచించినట్లు ఆరోపణలు రాగా తాజాగా దీనిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం స్పందించారు. ప్రమాదం తర్వాత టైగ్రే ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అజిత్ పవార్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి టైగ్రే పేరు బయటకు రావడంపై విలేకరులు ప్రశ్నించగా, టైగ్రే సంఘటన జరిగిన ప్రాంతానికి ఎమ్మెల్యే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా స్థానిక ఎమ్మెల్యే తరచూ సంఘటనా స్థలాన్ని సందర్శిస్తుంటారు. అలాగే ఇప్పుడు కూడా చేశారు, ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయవద్దని పవార్ తెలిపారు.

ఈ సంఘటన తర్వాత పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కి కాల్ చేశారా అని అడిగినప్పుడు, పవార్ మాట్లాడుతూ, నేను చాలా సమస్యలపై తరచుగా పోలీసు కమిషనర్‌కి ఫోన్ చేస్తుంటాను, అయితే ఈ కేసులో నేను ఆయనకు ఒక్క కాల్ కూడా చేయలేదని స్పష్టం చేశారు. హోం శాఖకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమాదం జరిగిన మరుసటి రోజే పుణె పోలీసులను ఇంటెన్సివ్ విచారణ చేపట్టాలని ఆదేశించారని పవార్ చెప్పారు. ముఖ్యమంత్రి కూడా సరైన ఆదేశాలు ఇచ్చారు.

మొదట్లో జాప్యం చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న హాస్పిటల్‌కు చెందిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అతను తాగి లేడని చూపించడానికి మైనర్ రక్త నమూనాలను అతని తల్లితో మార్చుకున్నందుకు సాసూన్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, ఒక సిబ్బంది పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఆ మైనర్ తల్లిని సైతం అరెస్ట్ చేశారు.


Similar News