సైనిక విన్యాసాల్లో ప్రమాదం..ఐదుగురు జవాన్లు మృతి

తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనిక విన్యాసాలు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-06-29 12:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనిక విన్యాసాలు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..లడఖ్‌లోని న్యోమా-చుషుల్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు విన్యాసాలు చేపట్టారు. అనంతరం శనివారం తెల్లవారుజామున టీ-73 యుద్ధ ట్యాంకుతో ష్యోక్ నదిని దాటుతుండగా.. అకస్మాత్తుగా నది నీటి మట్టం పెరగడంతోత ట్యాంక్ నదిలో మునిగిపోయింది. చుషుల్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక జూనియర్​ కమిషన్డ్​ అధికారితో సహా ఐదుగురు సైనికులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే నదిలో బలమైన నీటి మట్టం కారణంగా, సైనికులను రక్షించలేకపోయారు. ఐదుగురు జవాన్ల మృతదేహాలను బయటకు తీశారు.

ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ‘లడఖ్‌లో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సైనికుల ఆదర్శప్రాయమైన సేవలను ఎప్పటికీ మరచిపోలేం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ఈ దుఖ సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. 

Similar News