Abhishek Singhvi: గవర్నర్ పదవిని రద్దు చేయాలి.. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ

గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-02 09:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. గవర్నర్ పదవిని శాశ్వతంగా రద్దు చేయాలని లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడని వ్యక్తిని ఏకాభిప్రాయంతో నియమించాలని తెలిపారు. ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్‌గా మారితే, గవర్నర్ వెళ్లాల్సి ఉంటుందని, ఎందుకంటే ఎన్నికలు జరగాల్సింది సీఎం కోసమేనని చెప్పారు. గవర్నర్లు రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన బిల్లులను ఆమోదించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ మరో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ అనే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

గవర్నర్ బిల్లులను తిరస్కరిస్తే కోర్టుకు వెళ్లి ఆమోదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం గవర్నర్లకు మద్దతు తెలుపుతుందని ఇది సిగ్గుచేటని అభివర్ణించారు. ఇప్పటికైనా విధానాలు మార్చుకోవాలని గవర్నర్, సీఎంల మధ్య స్నేహపూర్వక వాతావారణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భయపడుతోందని ఆరోపించారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసిందని తెలిపారు. కాగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ వంటి విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌ల మధ్య పదేపదే వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సింఘ్వీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Similar News