'ఇండియాతోనే ‘ఆప్’.. వేరే దారిలో వెళ్లం'

Update: 2023-09-29 11:02 GMT

న్యూఢిల్లీ : ఇటీవల పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు వ్యవహారంతో ఆప్, హస్తం పార్టీ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌.. తాము ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈవిషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని తేల్చి చెప్పారు. ‘‘ ఇండియా కూటమికి దూరంగా వేరే దారిలో మేం వెళ్లం. డ్రగ్స్ కేసులో పంజాబ్‌ పోలీసులు ఒక కాంగ్రెస్ నేతను అరెస్టు చేశారని విన్నాను. దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర లేవు.

దీనిపై మీరు పంజాబ్‌ పోలీసులతో మాట్లాడుకోండి. డ్రగ్స్‌ ముఠాలను తుద ముట్టించాలనే నిబద్ధతతో భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రభుత్వం ఉంది. ఈ పోరాటంలో ఎవరినీ విడిచిపెట్టదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2015 నాటి డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను పంజాబ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ పరిణామాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభివర్ణించింది.

Similar News