AAP : హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో ఆప్‌ అట్టర్‌ప్లాప్‌! రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇదే

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

Update: 2024-10-08 08:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి హవా కొనసాగుతుండగా హర్యానాలో ఫలితాలు అనూహ్య మలుపు తిరుగుతూ బీజేపీ విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇక జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్లా ఖాతా తెరవలేకపోయింది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రం అయిన హర్యానాలో కూడా ఒక్క స్థానం కూడా ఆప్ కైవసం చేసుకోలేక అట్టర్‌ప్లాప్ అయింది.  దీంతో ఆప్ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే మహారాష్ట్ర, జార్ఘండ్, అలాగే మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదనే ఆప్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్థానిక కాంగ్రెస్ నేతలు ఆప్‌తో పొత్తుకు అనుకూలంగా లేరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కుర్చీని వదులుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించుకునే దిశగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఖాతా తెరవకపోవడంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Similar News