HIV Vaccine: 120 పేద దేశాలకు తక్కువ ధరకే హెచ్ఐవీ వ్యాక్సిన్లు..!

హెచ్‌ఐవీతో బాధపడుతున్న 120 పేద దేశాల్లో లెనాకాపవిర్‌ టీకాను(Lenacapavir Vaccine) తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తామని డ్రగ్‌ తయారీ కంపెనీ గిలియడ్‌ పేర్కొంది.

Update: 2024-12-02 08:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్‌ఐవీతో బాధపడుతున్న 120 పేద దేశాల్లో లెనాకాపవిర్‌ టీకాను(Lenacapavir Vaccine) తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తామని డ్రగ్‌ తయారీ కంపెనీ గిలియడ్‌ పేర్కొంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం(World AIDS Day) సందర్భంగా యూఎన్ఎయిడ్స్ నిర్వహించిన కార్యక్రమంలో గిలియడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. లెనాకాపవిర్ టీకాను అందించాలనుకున్న 120 పేదదేశాల్లో అత్యధికంగా 18 ఆఫ్రికన్ దేశాలే ఉన్నాయని గిలియడ్ ప్రకటించింది. ప్రపంచంలోని 70 శాతం హెచ్ఐవీ కేసులో ఆఫ్రికాలోనే ఉన్నాయంది. వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచేందుకు వేగవంతమైన, సమర్థవంతమైన ఏర్పాట్లు చేస్తున్నామంది.

యూఎన్ఎయిడ్స్

ఇకపోతే, మహమ్మారి వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఈ ఏడాది తగ్గిందని యూఎన్ఎయిడ్స్ (UNAIDS) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా ఓ నివేదిక విడుదల చేశారు. గతేడాది 6.30 లక్షల మంది ఎయిడ్స్‌ రోగులు మరణించారని తెలిపారు. ఇది 20 ఏళ్లలో అత్యల్పమని చెప్పుకొచ్చారు. 2004 నుంచి అత్యంత తక్కువగా మరణాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో టీకా వందశాతం ఫలితాలను ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఇప్పటివరకున్న ఇతర చికిత్సలతో పోలిస్తే.. ఈ వ్యాక్సిన్ మెరుగైన పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే లెనాకపవిర్‌ అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో అందుబాటులో ఉందన్నారు. లెనాకాపవిర్‌ను యూఎస్‌, కెనడా, యూరప్‌, ఇతర దేశాల్లో హెచ్‌ఐవీకి చికిత్సగా సన్లెకా బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్నామన్నారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తుల్లో చికిత్సకు ఇది అద్భుతం కంటే తక్కువేమీ కాదని అన్నారు. ఇక, ‘లెనాకాపవిర్’ (Lenacapavir) అనే కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని తేలింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆరునెలల వ్యవధిలో ఏడాదికి రెండు టీకాలు ఇవ్వడంతో ఇన్ ఫెక్షన్ తగ్గిపోతుందని నిర్ధారించారు.

Tags:    

Similar News