Shrikant Shinde: డిప్యూటీ సీఎం రేసులో లేను.. ఏక్ నాథ్ షిండే కుమారుడి వ్యాఖ్యలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రేసులో తాను లేనట్లు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) కుమారుడు శ్రీకాంత్(Shrikant Shinde) వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రేసులో తాను లేనట్లు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) కుమారుడు శ్రీకాంత్(Shrikant Shinde) వెల్లడించారు. శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. “ఉపముఖ్యమంత్రిని(Maharastra deputy CM) నేనే అని గత రెండ్రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి అందులో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలన్నీ నిరాధారమైనవి.” అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా తనకు కేంద్రమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. కానీ, పార్టీ సంస్థ కోసం పని చేయాలని భావించి, అప్పుడు కూడా పదవిని నిరాకరించినట్లు తెలిపారు. అధికారంలో ఉండాలనే కోరిక తనకు లేదన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం..
మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు కాస్త ఆలస్యమైందని శ్రీకాంత్ అన్నారు. ప్రస్తుతం, దీనిపై సర్వత్రా చర్చలు, పుకార్లు వస్తున్నాయని అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్య కారణాలతో రెండు రోజులు సొంత గ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అందుకే పుకార్లు పుట్టుకొచ్చాయన్నారు. ఇలాంటి వదంతులేవీ నమ్మవద్దని ప్రజలను అభ్యర్థించారు. ఇప్పటికైనా తన గురించిన చర్చలు ఆగిపోతాయనే ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం అయ్యింది.