‘బగ్గీ’ మే సవాల్.. ‘ఇండియా వర్సెస్ పాక్’ టాస్ చరిత్ర తెలుసా?
దిశ, నేషనల్ బ్యూరో : శుక్రవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విలాసవంతమైన గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి వేదిక వద్దకు చేరుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : శుక్రవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విలాసవంతమైన గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈసారి వేడుకల ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి కర్తవ్యపథ్ మీదుగా ప్రయాణించారు. ఈ చారిత్రక బగ్గీ అందరి దృష్టిని ఆకట్టుకుంది. చివరిసారిగా దీన్ని 1984 సంవత్సరంలో రాష్ట్రపతుల కోసం వినియోగించారు. ఆ ఏడాది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో నాటి నుంచి భద్రతా కారణాలతో జనవరి 26 వేడుకల్లో బగ్గీ వాడకాన్ని ఆపేశారు. 40 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు వాడకంలోకి వచ్చిన ఈ గుర్రపు బగ్గీ చరిత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో కూడుకొని ఉంది. అదేంటో తెలుసుకుందాం..
టాస్.. ఉత్కంఠకు తెర..
1947 ఆగస్టు 15న మన దేశంలో బ్రిటీష్ వలస పాలన ముగిసింది. ఆ తర్వాత విలాసవంతమైన ఈ గుర్రపు బగ్గీని దక్కించుకునేందుకు భారత్, పాకిస్తాన్ ఆసక్తి చూపాయి. దీన్ని ఎవరు తీసుకోవాలనే దానిపై చివరకు ఇరుదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టాస్ వేసి.. ఎవరికి అనుకూలంగా ఫలితం వస్తే వారికే బగ్గీని అప్పగించాలని డిసైడయ్యారు. భారత్ తరఫున కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్తాన్‌కు చెందిన సాహబ్‌జాదా యాకుబ్ ఖాన్ కలిసి టాస్ వేశారు. లక్కీగా ఈ టాస్ మన దేశానికి కలిసొచ్చింది. కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్ గెలవడంతో బగ్గీ భారత్‌కు దక్కింది. నాటి నుంచి మన దేశ రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలకు దీన్ని వాడటం మొదలుపెట్టారు. ఆరు గుర్రాలతో లాగే ఈ బగ్గీ అంచులకు బంగారు పూత ఉంది. దీనిపై అశోక చక్రం ముద్రించి ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. ఈ బగ్గీని బ్రిటీష్ వైస్రాయ్ వినియోగించేవారు. కాగా, 2014, 2016 సంవత్సరాల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బీటింగ్ రీట్రీట్ కార్యక్రమానికి ఈ గుర్రపు బగ్గీలోనే వెళ్లారు.