ముంబైలో నడి రోడ్డుపై కుప్పకూలిన భారీ హోర్డింగ్! (వీడియో)

భారీ వర్షానికి నడి రోడ్డుపై పెద్ద హోర్డింగ్ కుప్ప కూలిన ఘటన ముంబై లో జరిగింది.

Update: 2024-05-13 13:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షానికి నడి రోడ్డుపై పెద్ద హోర్డింగ్ కుప్ప కూలిన ఘటన ముంబై లో జరిగింది. ముంబై నగరంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం మొదలైంది. విపరీతమైన గాలి వలన ఒక్కసారిగా దుమ్ము, ధూళి గాల్లో చేరి రోడ్లపై వాహానాలు కదలలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని చెడా నగర్ జింఖానా రిక్రియేషన్ సెంటర్ పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న భారీ హోర్డింగులు పెట్టే టవర్ కొద్ది కొద్దిగా వాలడం మొదలైంది. ఒక పక్క రోడ్డుపై వాహానాలు వెళుతుండగా.. మరో పక్క ఈ భారీ హోర్డింగ్ ఒక్క సారిగా కుప్పకూలింది.

ఇంత పెద్ద హోర్డింగ్ కూలడంతో అక్కడ ఉన్న జనాలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. హోర్డింగ్ పడటంతో రోడ్డు పై వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఆ హోర్డింగ్ కింద కూడా కొన్ని వాహానాలు చిక్కుకున్నాయి. ఈ ఘటనలో హోర్డింగ్ కింద 100 మంది దాకా చిక్కుకొని ఉండవచ్చని, ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి 35 మందిని వెలికితీశామని, వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బీఎంసీ అధికారి పూర్ణిమా సాహ్ తెలిపారు. ఎంతమంది గాయపడ్డారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది చాలా భయానకంగా ఉందని, ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.


Similar News