‘కోల్‌కతా వైద్యురాలికి పట్టిన గతే నీకు పడుతుంది’..డాక్టర్ని హెచ్చరించిన 16 ఏళ్ల బాలుడు
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్కత్తా ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి ఆపై హత్య ఘటన పై నిరసన, ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్కత్తా ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి ఆపై హత్య ఘటన పై నిరసన, ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులను కఠినంగా శిక్షించాలని..ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడాలంటే వణుకు పుట్టేలా చేయాలని నిరసన చేపడుతున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..సాథే నగర్లో వైద్యురాలు నిర్వహిస్తున్న క్లినిక్‌కు ఎదురుగా బాలుడు(16) నిన్న(శనివారం) మధ్యాహ్నం తన బైక్‌ను పార్క్ చేశాడు.
ఇది గమనించిన వైద్యురాలు అక్కడి నుంచి బైక్‌ను తీయమని చెప్పింది. దీంతో బాలుడు కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆ బాలుడు ఒక్కసారిగా డాక్టర్ పై కోపంగా చూస్తూ..‘కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచార ఘటన గుర్తుందిగా.. నీకు అదే గతి పడుతుంది’ అని హెచ్చరించాడు. దీంతో ఆ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరికొందరితో కలిసి తన భార్యపై బాలుడు దాడి చేసినట్లు బాధిత వైద్యురాలి భర్త ఆరోపించారు. తమకు సత్వర న్యాయం జరగాలని, నిందితుడు బాలుడు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.